తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ డివిజన్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు మహిళలను కత్తితో దారుణంగా హత్య చేసి, మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ సిద్ధిఖీని శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. నవంబర్ 4న బడంగ్‌పేట్‌లోని సాయి విహార్ నగర్ ఫేజ్-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలే ఈ హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ వివాహాల విషయంలో నిందితుడికి భార్య కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో తనను అవమానించడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించడంతో వారిపై కక్ష పెంచుకున్న నిందితుడు హత్యలకు పథకం రచించాడు. నవంబర్ 4న తన బావ యూసుఫ్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి అతడిని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఇంట్లో ఉన్న నిరంజన్ బీ, యూసుఫ్, ఎండీ రష్మలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో నిరంజన్ బీ, ఎండీ రష్మ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన యూసుఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం నిందితుడు కారులో అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ టాస్క్ ఫోర్స్, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి నవంబర్ 5న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తి, వాగన్ ఆర్ కారు (టీఎస్ 12 ఈఎం 9451), మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన పోలీసు బృందాలను అధికారులు అభినందించారు.
