తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఓల్డ్ ఏంఐజి లోని ప్రధాన రహదారిలో రైల్వే ట్రాక్ కు ఆనుకుని ప్రక్కన గత కొన్ని ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలు ఇండ్లలో పని చేస్తూ కూలీ నాలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసు సిబ్బంది అకస్మాత్తుగా విచ్చేసి జేసీబీలతో పూరి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హుటాహుటిన మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ తో కలిసి ఘటనా స్థలానికి విచ్చేసి రైల్వే అధికారులతో, ఆర్ పీ ఎఫ్ పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ ఆదేశానుసారం గత్యంతరం లేక పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేయడం సరికాదని వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా గుడిసెలు తొలగించవద్దని రైల్వే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పీఏసీ ఛైర్మెన్, శాసనసభ్యులు అరికపూడి గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, శ్రీకాంత్ దేవులపల్లి, మహేందర్ సింగ్, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నారు
