తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపేవారని, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి మరోసారి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (పర్యవేక్షకుడు)కు నెల రోజులుగా జీతం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తనకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న నెల జీతం విడుదల చేయించినట్లు కార్మికులకు వివరించారు. అదేవిధంగా కొన్ని రోజులుగా విధులకు దూరంగా ఉన్న వరప్రసాద్ అనే కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. సంబంధిత కార్మికుడిని విధుల్లోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండాలని, తమ యూనియన్లో చేరి హక్కుల సాధన కోసం కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆయన వెంటే ఉంటామని తెలిపారు.
