తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని పద్మశాలిపురం అంగన్వాడీ కేంద్రంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (వీసీపీసీ)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, వారి భద్రత, సంరక్షణపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బాలలపై జరిగే హింస, వేధింపుల నివారణ, బాలల హక్కుల సంరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, బడికి దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారికి అవసరమైన సంరక్షణ అందించడం వంటి అంశాలపై వివరించారు.
పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, వారి సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం కమిటీ ప్రధాన బాధ్యత అని తెలిపారు. బాలల హక్కులను కాపాడటంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు సమష్టిగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్, యువజన నాయకుడు అజయ్, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు పద్మజ, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది సరస్వతి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు వెంకటేశ్వరమ్మ, వరలక్ష్మి, రాజేశ్వరి, సునీత, తల్లులు, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.
