తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  మనకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో గౌరవంగా జీవించే మార్గాన్ని చూపిన పాఠశాలకు తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే ఆలోచన ప్రతి పూర్వ విద్యార్థిలో ఉండాలి. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ ప్రేమావతి పేట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి మంగలారం బాబురావు ఆదర్శంగా నిలిచారు.
పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న బాబురావు, తన బాల్య విద్యకు పునాది వేసిన పాఠశాల అభివృద్ధిలో భాగస్వామి కావాలనే సంకల్పంతో రూ.50 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను విరాళంగా అందజేశారు. పాఠశాల నిత్యావసరాలకు ఉపయోగపడేలా ఈ సౌండ్ సిస్టమ్‌ను ప్రధానో పాధ్యాయురాలు మునీరాబేగంకు అందించారు.
పూర్వ విద్యార్థులు చేపడుతున్న పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలకు బాబురావు అందించిన ఈ సహకారం మరింత ప్రోత్సాహాన్నిస్తోంది. చదువు చెప్పిన పాఠశాలను గుర్తుంచుకొని, నేటి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఆయన ఆలోచన అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పి. మల్లేష్ యాదవ్, గోల్కొండ రాజు కుమార్, ఎడ్లకాడి సూర్యం, చంద్రశేఖర్, బి.ఆర్. సుమన్, సురేష్, మోజెస్, నరేష్, ఎడ్లకాడి రవి, కవ్వగూడెం జనార్దన్, చిలుకూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు దాసరి సరిత, గాయత్రి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు వినోద, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చదువు నేర్పిన పాఠశాలను మరచిపోకుండా.. రేపటితరాల భవిష్యత్తుకు చేయూతనివ్వడమే నిజమైన గురుదక్షిణ. బాబురావు చేసిన ఈ మంచి పని మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు.