తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిలియంట్ విద్యాసంస్థలపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేఎన్ఆర్ సేవాదళం ప్రకటించింది. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిపై, పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న విద్యాసంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేసింది.
గత 25 ఏళ్లుగా బ్రిలియంట్ విద్యాసంస్థలు వేలాది మంది పేద, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని సేవాదళం పేర్కొంది. ఈ సంస్థల్లో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు వైద్యులు, ఇంజినీర్లు, వివిధ రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారని తెలిపింది. పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యాసంస్థలపై బురదజల్లడం ఆయా విద్యార్థులను, వారి కుటుంబాలను అవమానించడమేనని పేర్కొంది.
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కేఎన్ఆర్ సేవాదళం వెల్లడించింది. అలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించింది.
వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. లేకుంటే ఉద్యమం తప్పదు!
తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేఎన్ఆర్ సేవాదళం డిమాండ్ చేసింది. ప్రజాసేవకులు, విద్యాసంస్థల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేసింది. డిమాండ్‌ను పట్టించుకోకపోతే ఆమనగల్లు, కల్వకుర్తి ప్రాంతాల్లో కేఎన్ఆర్ సేవాదళం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
