తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్లు, నవంబర్ 3: ఆమనగల్లు మార్కెట్ కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళిత సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని, ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీకాలం నవంబర్ 22తో ముగియనున్న నేపథ్యంలో, రానున్న నూతన నియామకంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పసుపుల జంగయ్యకు అవకాశం కల్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. ఈ సందర్భంగా మెకానిక్ బాబా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని, అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఈసారి దళిత నాయకుడికి కేటాయించి, దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలని కోరారు. పసుపుల జంగయ్య గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేస్తున్నారని, గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి నమ్మకమైన అనుచరుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, గ్రంథాలయ సంస్థ సంచాలకుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి విజయానికి, ఎంపీ మల్లు రవి గెలుపునకు జంగయ్య విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గంలో మంచి పట్టున్న ఆయనకు ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.పసుపుల జంగయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కల్పించడం ఒక వ్యక్తికి పదవి ఇచ్చినట్లు కాకుండా, ఆమనగల్లు దళిత సమాజానికి దక్కే గౌరవంగా, బడుగు బలహీన వర్గాలకు కల్పించే భరోసాగా నిలుస్తుందని మెకానిక్ బాబా అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కేఎన్ఆర్ సేవాదళం తరఫున విజ్ఞప్తి చేశారు.
