• రాష్ట్రవ్యాప్తంగా 4,451 మందికి మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – దరఖాస్తు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వేలాది మంది చేనేత కార్మికులు చేయూత పథకం కింద పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు విధిస్తున్న అనేక ఆంక్షల కారణంగా అర్హులైన కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

వృత్తిలో ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4,451 మందికి మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సరికాదని విమర్శించారు. చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్న జియో ట్యాగ్ నంబర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడైన చేనేత కార్మికుడికి వెంటనే చేయూత పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మెరుపు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాలకు సంబంధించిన క్యాష్ క్రెడిట్ రుణాలను వెంటనే మాఫీ చేసి, కొత్తగా రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత పరిశ్రమ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, పెన్షన్ల అంశంపై తక్షణమే అధికారిక ప్రకటన విడుదల చేయాలని రాపోలు వీరమోహన్ డిమాండ్ చేశారు.