తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: సమాజ శ్రేయస్సే అభిమతంగా భావించి తమ జీవితాలను సమాజ సేవకే అంకితం చేసిన మహానుభావులందరికి మైత్రి హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న కుమారి వందనాలను తెలియజేశారు. నేటి యువత మానసికమైన, శారీరకమైన, ఆరోగ్య విషయాలపై డాక్టర్ రత్న కుమారి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రత్న కుమారి మాట్లాడుతు, కంఫర్ట్ జోన్ ఎప్పటికీ ఎదుగుదలను ఇవ్వదని తెలిసినప్పటికీ, పిల్లలపై ప్రేమతో అనవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారని, దీనివలన పిల్లలు ఏమీ నేర్చుకోవడం లేదని, పూర్వ కాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి మైళ్ల దూరం నడిచేవారని, ఆ నడక వారి శారీరక ఆరోగ్యానికి సహాయపడేదని, అంతేకాకుండా పిల్లల మానసిక , శారీరక ఆరోగ్యం సమతుల్యంగా ఉండేదని తెలిపారు. నేటి విద్యార్థులలో సమాజ అవగాహన లేదని, పాఠశాలకు కేవలం రాయడం, చదవడం, గ్రేడ్‌లు, ర్యాంకులు సంపాదించే ప్రదేశంగా మారిపోయిందని , తమ పిల్లలు ఆడుకుని గాయపడకూడదని తల్లిదండ్రులు భావిస్తున్న క్రమంలో సరైన క్రీడలు లేవని, ఆటలన్ని ఆన్‌లైన్‌లో ఆడుతున్నారని మానసిక అనారోగ్య విషయాలలో మరింత ప్రమాదకరమైన నష్టం జరుగుతుందనే విషయాన్ని మరచిపోతున్నారని, ప్రాజెక్ట్ పనులను సైతం ఆన్‌లైన్‌లో వెతకి కట్ చేసి కాపీ,పేస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. భవిష్యత్తరాల పిల్లలకు ఆలోచించడానికి, పరిశోధించడానికి, సృష్టించడానికి ఎలాంటి అవకాశాలను పిల్లలకు కల్పిస్తున్నామనే విషయాలపై తల్లిదండ్రులు స్వీయ పరిశీలన చేసుకోవడం అవసరమని, విద్యార్థుల మార్కుల షీట్ ప్రపంచాన్ని పరిమితం చేస్తుందని, ఆచరణాత్మక జ్ఞానం లేకపోవడం పిల్లలను నిరాశకు, నిరుపయోగానికి గురిచేస్తుందని, యువత తప్పుదారి పట్టి సైబర్ నేరాల వైపు ఆకర్షితులవుతున్నారని, వారు తమ జ్ఞానాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగిస్తూ, తెలియకుండానే సమాజానికి ముప్పుగా మారుతున్నారని, జ్ఞానం పుస్తకాలకు అతీతమైనదని పేర్కొన్నారు.