రాష్ట్రవ్యాప్తంగా బీసీ కమిటీలను బలోపేతం చేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాకల పర్శరాములకు బాధ్యతలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బీసీలను సంఘటితం చేసి, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంఘాన్ని బలోపేతం చేసే బాధ్యతను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాకల పర్శరాములకు అప్పగించారు. ఈ విషయాన్ని సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు.

విద్యానగర్లోని బీసీ భవన్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో నూతన బీసీ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.
బీసీల హక్కులు, సంక్షేమం, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై బీసీలను చైతన్యపరిచి, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీసీలకు కేవలం ప్రాతినిధ్యం మాత్రమే కాకుండా, నిర్ణయాధికారంలో కూడా న్యాయమైన వాటా దక్కేలా సంఘటితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, బీసీ నాయకులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ బీసీ కులసంఘాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మ్యాకల పర్శరాములకు సూచించినట్లు కృష్ణయ్య తెలిపారు.
“రాష్ట్రవ్యాప్తంగా బీసీలను సంఘటితం చేసి, బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. బీసీల హక్కుల సాధన కోసం ప్రతి స్థాయిలో బలమైన నాయకత్వాన్ని నిర్మించాలి,” అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
