కరీంనగర్, నవంబర్ 25: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కరీంనగర్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో వారి చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. దీనివల్ల ఉన్నత చదువులకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వివిధ అవసరాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, అప్పులు తెస్తూ కూడా విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయకపోవడం విద్యార్థి వ్యతిరేక చర్య అని వారు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన సమాన విద్యావకాశాల సాధనలో కీలకమైన పథకమని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీసీ సంఘాలు సహించబోవని హెచ్చరించారు.
బీసీ సంఘాల డిమాండ్లు:
- పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలి.
- కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలు వెంటనే సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలి.
- పెండింగ్ నిధుల విడుదలకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి.
- ఈ సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, బీసీ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలి.
విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేయవద్దని, బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటి స్వరూప, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ అనుమస నితిన్, అంజాద్, బీసీ మహిళా సంఘం జనరల్ సెక్రటరీ కరుపాక మునక్క, టౌన్ ప్రెసిడెంట్ రాజుల నవ్య, టౌన్ జనరల్ సెక్రటరీ బొంతుల తిరుమల, బీసీ సంఘం నాయకులు రమేష్, అశ్విత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
