తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన జీవితాశయాన్ని సాధించేందుకు చేసిన పోరాటం, ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాల నేపథ్యంలో ‘దుర్గ’ పేరుతో రూపొందుతున్న సినిమా సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్తగూడెంకు చెందిన దర్శకుడు, కథానాయకుడు బొమ్మ హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌కు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రముఖ సినీ నటుడు ఆనంద్ చక్రపాణి చేతుల మీదుగా సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆనంద్ చక్రపాణి మాట్లాడుతూ.. బొమ్మ హరిప్రసాద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని ప్రశంసించారు. సినిమా ఘనవిజయం సాధించాలని, భవిష్యత్తులో ఇలాంటి మంచి కథాంశాలతో మరిన్ని చిత్రాలను నిర్మిస్తూ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
చేనేత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన కష్టాలు, సాధించిన విజయాలను వెండితెరపై ఆవిష్కరించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్ర బృందం వెల్లడించింది.
గతంలో బొమ్మ హరిప్రసాద్ పలు లఘు చిత్రాలను రూపొందించి గుర్తింపు పొందారు. తన సృజనాత్మకతతో సినీ రంగంలో మరింత ముందుకు సాగేందుకు ‘దుర్గ’ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చేనేత కుటుంబాల జీవన నేపథ్యాన్ని, యువత ఆశయాలను ప్రతిబింబించే ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
