విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన పూదరి రమ్యకృష్ణ అనిల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్:

జమ్మికుంట వీణవంక మండల పరిధిలోని కోర్కల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించే బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్ పాల్గొని విద్యార్థులకు స్వయంగా టిఫిన్ వడ్డించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా చదువులో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాఠశాలలోనే ఉదయం నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.