బీఆర్ఎస్ యువ నాయకుడు మైనాల నరేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమ బాట పట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ యువ నాయకుడు మైనాల నరేష్ అన్నారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని, ఆయన పట్టుదల, పోరాట పటిమతో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కీలక మలుపు తిరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చిన కానుక కాదని, వేలాది మంది ఉద్యమకారుల పోరాటాలు, విద్యార్థుల త్యాగాలు, ఉద్యోగులు, మహిళలు, ప్రజల ఉద్యమాలు, అమరవీరుల బలిదానాల ఫలితమేనని అన్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం నవంబర్ 29న నిర్వహించుకునే దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాన్ని గుర్తుచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడమే కేసీఆర్కు మనం ఇచ్చే నిజమైన గౌరవమని అన్నారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని మైనాల నరేష్ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ యువ నాయకుడు మైనాల నరేష్