తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పేరొందిన విద్యాలయాలలోని ఒకటైన మైత్రి హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నకుమారి పాఠశాలలో నేటి విద్యాబోధనా విషయంలో విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు స్పందిస్తున్న తీరుపై డాక్టర్ రత్నకుమారి మాట్లాడుతు, పాఠశాల అనేది విద్యాభ్యాస స్థలం అని, పాఠశాలకు విద్యార్థులు విద్యను నేర్చుకోవడానికే వస్తారని, కానీ నేటి తరం విద్యనేర్చుకోవడానికి బదులుగా ఉపాధ్యాయులనే ఎదురు ప్రశ్నించేలా తయారవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల విలువలను, ఉపాధ్యాయ గౌరవించే విధానాలను సరైన విదంగా నేర్పకపోవడం వలనే చిన్నారులు ఇలా తయారవుతున్నారని, ఇల్లే మొదటి పాఠశాలగా, తల్లిదండ్రులే మొదటి గురువులుగా భావించి, పాఠశాలలోకి చేరబోయే ప్రధమ దశలోనే విద్యార్థులకు పాఠశాల అంటే విద్య నేర్చుకునే ప్రదేశమనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని, విద్య నేర్చుకోవడానికే పాఠశాలకు వస్తున్నారని, పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ విద్యను బోధించడానికి సహాయకులుగా ఉంటారని, ఉపాధ్యాయులు బోధించినది పిల్లలు ముందుగా విని, సరిగ్గా స్పందించాలన్నారు. కాని, దురదృష్టవశాత్తు నేటి తరం విద్యార్థులు తరగతి గదులలో పాఠాలు బోధించే సమయంలో సరియైన శ్రద్ధతో వినేందుకు ఆసక్తి చూపించని వారిపై ఉపాధ్యాయులు తీసుకునే క్రమశిక్షణపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ నేరుగా పాఠశాలకు విచ్చేసి విద్యార్థుల సమక్షంలోనే ప్రశ్నించడం వలన ఈ తరం పిల్లలు పాఠశాలలోని ఉపాధ్యాయులను గౌరవించడం లేదని, వారి పాఠ్యాంశాలను సైతం వినడానికి సిద్ధంగా లేరని వాపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నించడం మంచిదేకానీ విద్యార్థుల సమక్షంలో కాకుండా జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఉపాధ్యాయ బృందంతో చర్చిస్తే బాగుంటుందని, నేడు ఉపాధ్యాయులను గౌరవించని పిల్లలు, భవిష్యత్తులో తల్లిదండ్రులను కూడా గౌరవించేందుకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం , ఉపాధ్యాయులు కేవలం డబ్బు సంపాదన కోసమే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోరని, సమాజ సేవలో బాగంగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారని, క్రమశిక్షణ లేకుండా ఇచ్చే శిక్షణ నిరుపయోగమని పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వడం ఉపాధ్యాయుల కర్తవ్యమని, శిక్షణా కాలంలో పిల్లలు సమయపాలన, క్రమశిక్షణ, వస్త్రధారణ శుభ్రత , సిబ్బందితో విద్యార్థుల మంచి ప్రవర్తనను తప్పనిసరిగా పాటించాలనేది పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు నేర్పుతారని, నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని అని పెద్దలు చెప్పినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే ఉపాధ్యాయులు కృషి చేస్తారనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని విన్నవించారు. పాఠశాల సిబ్బందిని గౌరవించండి, వారు కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, ప్రతిరోజూ మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారని విద్యార్థులు తప్పుగా ప్రవర్తించినప్పుడు, శిక్షకుడు చర్య తీసుకోవాలని, అది వారి విధి అని, తల్లిదండ్రులు పిల్లలను శిక్షణ, చదువు కోసం పాఠశాలకు తీసుకువస్తారని. కానీ చర్య లేకుండా శిక్షణ ఎలా కోరుకుంటారని, అందరూ సమాజం బాగుండాలని కోరుకుంటారని, నేటి పాఠశాలలు సమాజాన్ని నిర్మిస్తున్నాయని సురక్షితమైన, సౌకర్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి తల్లిదండ్రులు, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కలిసి రావాలని, నిందించడం, వాదించడం, ప్రశ్నించడం ఎప్పుడూ సరైన పరిష్కారాన్ని ఇవ్వదని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తెలుసుకోవడం, అంగీకరించడం, ఆలోచించడం, చర్చించడం ప్రతి సమస్యకు ఉత్తమ పరిష్కారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
