తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కార్తీక కోటి దీపోత్సవంలో భాగంగా నిర్వహించిన దీపారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రముఖ ఆదిత్య పరస్త్రీ స్వామీజీ, మల్లికార్జున శర్మ స్వామీజీ హాజరై భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆదిత్య పరస్త్రీ స్వామీజీ మాట్లాడుతూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. దీపారాధన విశిష్టతతో పాటు కార్తీక మాసానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లోకకల్యాణం కోసం నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని, భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తానని తెలిపారు.
మల్లికార్జున శర్మ స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వేలాది దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. భక్తులు సామూహికంగా దీపారాధన నిర్వహించి లోకకల్యాణం, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ బస్వాం అప్పా కేకే కృష్ణ, కేశంపేట మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి,  కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు సింగారం శ్రీనివాస్, నివాస్ బ్రదర్స్, బర్మలి జంగయ్య, ప్యాట అశోక్, కొండోజు వంశీకృష్ణ, ప్యాట జయశ్రీకాంత్, శ్రీధర్ గౌడ్, వెంకట్ రెడ్డి, సన్నిధానం నరేందర్, ఏదిరా రాజేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మేడిగ దామోదర్, గందం శ్రీనివాస్, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.