తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తల్లి మరణించిన సమయంలో కనీసం కడసారి చూపునకు కూడా రాని కొడుకు, కొన్ని రోజుల తర్వాత గ్రామానికి రావడంతో గ్రామస్తుల ఆగ్రహానికి గురైన ఘటన జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కీర్తిశేషులు నాగబండి రామచంద్రం భార్య పుష్పనీల మరణించిన సమయంలో ఆమె అంత్యక్రియలకు కుమారుడు ఉప్పలయ్య హాజరుకాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అందరితో ఆప్యాయంగా మెలిగే పుష్పనీలను గ్రామస్తులు తమ కుటుంబ సభ్యురాలిగా భావించేవారని, ఆమె మరణం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందని తెలిపారు.
తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులే ముందుకొచ్చి ఆమె అంతిమ సంస్కారాలను నిర్వహించారు. తమ ఇంటి మనిషిగా భావించి భుజాలపై మోసి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత కుమారుడు ఉప్పలయ్య కుటుంబ సభ్యులతో కలిసి కారులో గ్రామానికి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరి బయటే కారును అడ్డగించి, తల్లి బతికున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని, మరణించిన సమయంలో అంత్యక్రియలకు ఎందుకు రాలేదని నిలదీశారు. ఆస్తి కోసమే ఇప్పుడు గ్రామానికి వచ్చారా అంటూ మహిళలు, యువకులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది. కొందరు గ్రామస్తులు కారులో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు లాగి దాడి చేసినట్లు తెలిసింది. అనంతరం వారిని గ్రామం నుంచి వెనక్కి పంపించారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో కుమారుడు ఉప్పలయ్య అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
రక్తసంబంధం ఉన్నవారికంటే ఆపద సమయంలో అండగా నిలిచే మానవత్వం గొప్పదని ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. తల్లి అంత్యక్రియలను గ్రామస్తులే నిర్వహించడం పలువురిని కదిలించగా, అనంతరం చోటుచేసుకున్న ఘర్షణ స్థానికంగా కలకలం రేపింది.
