• ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం హక్కు
  • చిన్న పిల్లల హక్కుల భంగన సమస్య వస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి..
  • విద్యా నాణ్యత పెంపుతో పాటు పిల్లల ఆరోగ్యం,పోషణపై ప్రత్యేక దృష్టి..
  • బాలల సంరక్షణ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

న్యూస్ డెస్క్: బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, బాలల సంరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మిషన్ వాత్సలయ్, అంగన్వాడీ సేవలు, ప్రీ-ప్రైమరీ విద్య, బాలల సదనాల ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం,సురక్షిత వాతావరణం పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏ చిన్నారికి అయినా సమస్యలు ఎదురైతే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలో విద్యా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నాణ్యత పెంపుపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల చదివే సామర్థ్యం (ఓ.ఆర్.ఎఫ్) పఠన అవగాహన (ఆర్.సి) వంటి సూచికల్లో గణనీయమైన మెరుగుదల నమోదైందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు సమతుల్య పోషకాహారం అందిస్తూ,వారి ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఆర్.బీ.ఎస్.కే కార్యక్రమం ద్వారా పిల్లలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ,ఏ ఆరోగ్య సమస్య ఉన్నా తక్షణ చికిత్స అందిస్తున్నామని,అవసరమైతే శస్త్రచికిత్సలను కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం బాల్యవివాహాల రహిత గ్రామంగా ఎంపికైన పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్ కు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్‌ను అందజేశారు. బాల్యవివాహాల నిర్మూలనలో గ్రామ ప్రజలు చూపిన చైతన్యం అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ రావు,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.