
న్యూస్ డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో పాటు, దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఎల్ఏ నియామకాలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీల ఏర్పాటుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ నాయకులకు తగిన సూచనలు చేశారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా గ్రామస్థాయికి చేర్చేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీ-పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడం లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేయాలని, రాబోయే రెండేళ్లు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
