తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్‌భవన్ ముట్టడి, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలను, రైతు చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు, రైతుల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్‌భవన్ వైపు ర్యాలీగా తరలివెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ ఇన్‌చార్జి వి.ఎస్. బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.