తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వాల్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లో గ్రామ సర్పంచ్ తేజావత్ నాగ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. గతంలో పోలియో మహమ్మారి వల్ల ఎంతోమంది పిల్లలు అంగవైకల్యానికి గురయ్యారని అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన చిన్నారులందరికీ వంద శాతం పోలియో చుక్కలు వేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
