తెలంగాణ ఎక్స్ ప్రెస్, కూకట్ పల్లి: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీ మధ్యాహ్నం ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారికి రూ20 ఇస్తానని ఆశ చూపించి మహ్మద్ శంషుద్దీన్ (60సం) అనే రిక్షా కార్మికుడు తన రిక్షాపై ఎక్కించుకొని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో స్థానికంగా నివసించే రమేష్, మువ్వాలమ్మ దంపతులు నిందితుడి దుశ్చర్యను గమనించి తక్షణమే స్పందించారు. నిందితుడి బారి నుంచి బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మహ్మద్ శంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏడేళ్ల బాలికను లైంగిక దాడి నుంచి సమయస్ఫూర్తితో రక్షించిన దంపతులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శనివారం కొల్లాటి రమేష్, మువ్వాలమ్మ దంపతులను ఆయన శాలువాతో సత్కరించి, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ, సమాజంలో నేరాల నియంత్రణకు పౌరుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసుల నిఘాతో పాటు పౌరుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమని, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ పరిస్థితులు కనిపిస్తే తక్షణమే డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడటంలో రమేష్, మువ్వాలమ్మ దంపతులు చూపిన చొరవ, సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డీసీపీ రమణా రెడ్డి, బోరబండ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సురేందర్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
