తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల మ్యాపింగ్, ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, బీఎల్ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లను గుర్తించి తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అదే సమయంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత కలిగిన యువతకు కొత్త ఓటు నమోదు చేసే అవకాశం కల్పించాలని తెలిపారు. ప్రతి కుటుంబం బీఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా తీసుకొని, తమ వివరాలను పూర్తిగా, సక్రమంగా నమోదు చేసి తిరిగి అందజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవడం ప్రజాస్వామ్య పట్ల ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా నిజమైన ఓటర్లను గుర్తించడం, కుటుంబాల వారీగా ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించడం, కొత్త ఓటర్లను చేర్చడం, అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేయడం జరుగుతుందని తెలిపారు. నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు ఈ సవరించిన ఓటరు జాబితా ఆధారంగానే నిర్వహించబడనున్నందున ప్రతి బూత్‌లో బీజేపీ కార్యకర్తలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. పాత ఓటరు జాబితాలను పరిశీలిస్తూ ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేసి, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమం జూలై 24వ తేదీ వరకు కొనసాగనున్నందున ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఇందులో భాగస్వామి కావాలని, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని గంగాధర్ రెడ్డిగారు విజ్ఞప్తి చేశారు. అనంతరం గంగాధర్ రెడ్డి గారు బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎమ్యూనరేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, కిషన్ గోలి, ప్రసాద్, సుమన్ రాకేష్, హెరాన్, అంబన్, అరుణ్ గౌడ్, సుధాకర్, రాజేష్, నిర్మల, భారతి, అరుణ్, బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
