తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు మండలానికి ప్రతిష్టాత్మకంగా 9 మహిళా భవనాలను మంజూరు చేయడం పట్ల మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా భవనాల మంజూరుకు కృషి చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావుల చిత్రపటాలకు చిన్నకోడూరు మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు కలిసి ఘనంగా పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా, వారు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలుగా చిన్నకోడూరు మండలానికి ఒకేసారి 9 మహిళా భవనాలను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొనియాడారు. ఈ భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలకు, వివిధ కార్యక్రమాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ఇంచార్జ్ మంత్రి వివేక్‌కు, మైనంపల్లి హన్మంతరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
