• పాఠశాల అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై సమీక్ష

• సోషల్ ఆడిట్లో పాల్గొన్న సర్పంచ్ హసీనా బాను విద్యార్థుల సంక్షేమానికి పారదర్శక వ్యవస్థ అవసరం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల
కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బుధవారం సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నిధుల వినియోగంపై సమీక్షించేందుకు ఈ సోషల్ ఆడిట్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సోషల్ ఆడిట్ ప్రత్యేక అధికారుల బృందం హాజరై పాఠశాలలో అమలవుతున్న పలు అంశాలను పరిశీలించింది. పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ నిధుల వినియోగంపై అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహాదేవపూర్ గ్రామ సర్పంచ్ హసీనా బాను మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సోషల్ ఆడిట్ ఒక ముఖ్యమైన ప్రక్రియ అని అన్నారు. పాఠశాలల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల ఖాళీ స్థలంలో చెట్లు నాటిన ఎంఈఓ మరియు సర్పంచ్ హసీనాబాను ఉపాధ్యాయులు వాటితోపాటు ప్రత్యేక అధికారులు పాఠశాల రికార్డులను పరిశీలించి, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, స్పెషల్ ఆఫీసర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.