తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, పీఏసీఎస్ కేంద్రం, ఆర్డీఓ కార్యాలయాల తనిఖీ. గర్భిణులు, చిన్నారుల పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం కాటారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, సంక్షేమ పథకాల అమలు, రైతులకు అందుతున్న సేవలు, రెవెన్యూ వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అంగన్వాడి కేంద్రంలో బాలామృతం పంపిణీ.
ముందుగా కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్యం, పోషణ, విద్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. బాలింతలకు, చిన్నారులకు బాలామృతం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ
అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
పీఏసీఎస్ కేంద్రంలో రైతులతో ముఖాముఖి:
తదుపరి కాటారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, యూరియా బుకింగ్ వివరాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ నిర్వహణపై వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి యూరియా బుకింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతోందా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నానో యూరియా వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలోని బల్క్ ల్యాండ్ సమస్యలు, సాదా బైనామా, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, వ్యవసాయ అధికారి బాబురావు, మహిళా, శిశు సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీడీపీఓ రాధిక, తహసీల్దార్ నాగరాజ్, ఎంపీడీవో బాబు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
