• నిజమైన తెలంగాణ ఉద్యమకారులకే గుర్తింపు కల్పించాలి – BSMAT

• తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో బీఎస్‌మ్యాట్ (BSMAT)ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, జూలై 9 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, తొలి దశ, మలిదశ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి నిజమైన ఉద్యమకారుడికి న్యాయమైన గుర్తింపు లభించేలా ప్రభుత్వం పారదర్శకమైన, నిష్పక్షపాత విధానాన్ని అమలు చేయాలని పలువురు నాయకులు కోరారు. ఉద్యమ చరిత్రను వక్రీకరించకుండా, త్యాగాలను గౌరవించే విధంగా అర్హత ప్రమాణాలు రూపొందించి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు కేశవరావు, అద్దంకి దయాకర్తో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BSMAT) రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బీఎస్‌మ్యాట్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు విద్యార్థి ఉద్యమకారుల సేవలను కూడా సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఉద్యమానికి సంబంధించిన ఆధారాలను సరళమైన విధానంలో స్వీకరించి, నిజమైన ఉద్యమకారులు ఎవరూ గుర్తింపుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వారికి సంక్షేమ పథకాలు, గౌరవ భృతి, ఆరోగ్య భద్రత, కుటుంబ సంక్షేమం, విద్యా సౌకర్యాలు వంటి అంశాలపై ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు గౌరవప్రదమైన స్థానం కల్పించడం ప్రభుత్వ చారిత్రక బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమ సంస్థలు, కుల సంఘాల ప్రతినిధులు, తొలి దశ మరియు మలిదశ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు కమిటీకి అందజేశారు.

Avatar photo

By Murthy