తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఈరోజు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషనన్ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ గారు, సిబ్బంది రోలకాలు తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల మరియు ప్రజలకు అందుతున్న సేవలపై సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, ప్రజలకు పోలీస్ శాఖపై మరింత విశ్వాసం కలిగేలా ప్రతి అధికారి బాధ్యతగా మరియు జవాబుదారీతనంతో సేవలు అందించాలని స్పష్టం చేశారు.స్టేషన్లో నమోదైన ప్రతి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నాణ్యమైన దర్యాప్తు ప్రమాణాలను పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని కైమ్ ప్రాపర్టీ భద్రతపై ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన నిబంధనల ప్రకారం భద్రపరచాలని, వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో పటిష్టమైన వాహన తనిఖీలు మరియు గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ గారు చెప్పారు. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, లాటరీ మోసాలు, ఫేక్ లింకులు మరియు ఓటీపీ మోసాల పట్ల గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా, అత్యవసర సమయాల్లో డయల్-100 ద్వారా వచ్చే పిలుపులకు అత్యంత వేగంగా స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు తక్షణ సహాయం అందించి భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇదే క్రమంలో కామారెడ్డి పట్టణ ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ గారు ప్రత్యేక సమీక్ష జరిపారు. ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖరు ఉద్దేశించి మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా సమర్ధవంతమైన ఎన్ఫోరెస్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.