తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్‌లోని గోసాయి కుంట చెరువు, గౌలిదొడ్డి ప్రాంతాల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి జి. సృజన, ఐఏఎస్ , శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్, భువనగిరి ఎంపీ . చామల కిరణ్ కుమార్ రెడ్డి , శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ సేవ ఎస్లావత్ నాయక్ , జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కలిసి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రజల తరఫున పలు ముఖ్యమైన అభివృద్ధి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. గోసాయి కుంట చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని కల్పించాలని, చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు చేపట్టి విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. అదేవిధంగా చిన్నారుల కోసం ఆధునిక ఆట స్థలాలు, వృద్ధుల కోసం విశ్రాంతి ప్రదేశాలు, ఓపెన్ జిమ్, హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు, తాగునీరు, పార్కింగ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి గోసాయి కుంటను నగర ప్రజలకు ఆదర్శవంతమైన వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గౌలిదొడ్డి నుండి విప్రో సర్కిల్ వరకు రహదారిని అత్యవసరంగా విస్తరించి, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రోడ్డు విస్తరణతో పాటు పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్, ఆధునిక వీధి దీపాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, అవసరమైన జంక్షన్ అభివృద్ధి పనులను కూడా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రతిరోజూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ప్రయాణిస్తున్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారిని విస్తృతంగా అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం, ఇరిగేషన్ అధికారులతో కలిసి గోసాయి కుంట చెరువును పరిశీలించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి జి. సృజన, ఐఏఎస్ , చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించాలని, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, పచ్చదనం, ఆధునిక సౌకర్యాలతో సమగ్ర అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గౌలిదొడ్డి నుండి విప్రో సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి, రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యం సమగ్ర అభివృద్ధే లక్ష్యం అనే సంకల్పంతో గచ్చిబౌలి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ టీజీటీఎస్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్,ఎస్ ఈ శంకర్ నాయక్, జిహెచ్ ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష,ఏఈ భాస్కర్, సీనియర్ నాయకులు కిషన్ గోలి తిరుపతి, ప్రసాద్, రాజు, శ్రీను, యాదయ్య, గోవింద్ నగేష్, స్థానిక నేతలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
