తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ (జులై 16): అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలు మొన్నటి వరకు రోడ్డు రవాణా ద్వారా గంజాయి సరఫరా చేసుకున్నారు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించి ఇప్పుడు ఏకంగా రైలు మార్గాన్ని సరకు రవాణాకు ఎంచుకున్నారు.

దేశంలోనే అత్యధికంగా గంజాయి సరఫరా జరిగే రోడ్డు మార్గాలు ఒడిశా-ఏపీ-తెలంగాణ-మహారాష్ట్ర మీదుగా వెళ్తున్నాయని మాదక ద్రవ్యాల నిర్మూలన నిఘా బృందాల పరిశీలనలో తేలింది. ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని ఏజెన్సీలో గంజాయి తక్కువకు కొనుగోలు చేసి రోడ్డు మార్గాల్లో మహారాష్ట్రకు అక్కడి ముఠాలు తరలిస్తున్నారు. తిరిగి అక్కడ్నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలతో పాటు హైదరాబాద్కు గుట్టుగా అంతర్రాష్ట్ర ముఠాలు చేరవేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో చేపట్టే తనిఖీల్లో.. ముఖ్యంగా నాగావళి ఎక్స్ప్రెస్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది.

నాగావళి ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో కామారెడ్డి వద్ద ఎక్సైజ్, ఆర్పీఎఫ్ అధికారులు మే 16వ తేదీన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర వాసి వద్ద బ్యాగులో 5.35 కిలోల గంజాయి లభ్యమైంది.

కామారెడ్డి ఎక్సైజ్ పోలీసులు ముందస్తు సమాచారంతో జూన్ 30వ తేదీన అదే రైలులో సోదాలు చేపట్టగా… నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్, మహారాష్ట్రకు చెందిన గణేశ్ వద్ద 10.9 కిలోల గంజాయి దొరికింది.

నిజామాబాద్ జంక్షన్లో నాగావళి ఎక్స్ ప్రెస్ న్ను ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేశారు. బిహార్కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్ లు 5.1 కిలోల ఎండు గంజాయి పొట్లాలు తరలిస్తూ చిక్కారు.

నాగావళి ఎక్స్ ప్రెస్ ఒడిశాలోని సంబల్ పూర్ ప్రారంభమవుతుంది. ఏపీ, తెలంగాణ మీదుగా 1,474 కి.మీ. ప్రయాణించి మహారాష్ట్రలోని నాందేడ్కు 27 గంటల తర్వాత చేరుతుంది. అన్ని స్టేషన్లలోనూ ఇది ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది.. కొన్ని ముఠాలకు చెందిన వారు ఎండు గంజాయి వాసన రాకుండా పాలిథిన్ కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ సంచులు బ్యాగులు, సూట్కేస్లలో నింపి రైలు జనరల్ బోగీల్లో బెర్తుల కింద, టాయిలెట్ల వద్ద పెడుతున్నారు. తర్వాత వేరే బోగీల్లో కూర్చుంటున్నారు. పోలీసు తనిఖీల్లో సరకు దొరికినా నిందితులు తప్పించుకుంటున్నారు.

ఇటీవల కాలంలో విశాఖ ఎక్స్ప్రెప్రెస్ (విశాఖ- షిర్డీ)తో పాటు నాగావళిలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. రద్దీ కారణంగా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఎన్సీబీ వంటి బృందాలు ప్రతి ఒక్కరినీ సునిశితంగా తనిఖీ చేయడం సవాలు అవుతోంది. ఏదేమైనా.. రైలులో గంజాయి రవాణా చేయకుండా నిఘాను పటిష్టం చేస్తేనే మత్తు మహమ్మారికి అడ్డుకట్టపడుతుంది.