తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్తో కల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారుజామున సుమారు 6 గంటలకు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతుల వద్దకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేయడంతో పలువురు కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. సంఘటన స్థలంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తోకల శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో రాజేంద్రనగర్ ప్రాంతంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
రైతులకు మద్దతు తెలిపేందుకు శాంతియుతంగా వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడేనని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, ఇటువంటి అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు.
