తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా: తనతో సన్నిహితంగా ఉన్న మహిళ వేరొకరితో చనువుగా ఉందని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆమెను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా డీస్పీ మధుసూదన్ తన కార్యాలయంలో చెప్పిన వివరాలు ప్రకారం పాల్వంచ మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సపురం శ్యామల, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శిరాన్పల్లికి చెందిన పిట్ట నర్సింలు కూలీలు. వీరు కామారెడ్డిలోని లేబర్ అడ్డాకు వచ్చేవారు. కలిసి కూలీ పనులకు వెళ్లేవారు. శ్యామల వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన నర్సింలు ఆమెపై అసూయ పెంచుకున్నాడు.

శ్యామల తన భర్త రాజంతో కలిసి మే 31న కామారెడ్డిలోని లేబర్ అడ్డాకు వచ్చింది. భర్తకు పని దొరకగా ఆమెకు దొరకలేదు. ఆమె, నర్సింలు కలిసి కామారెడ్డి గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన పొదల వద్ద మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆమె తలపై రాయితో బలంగా కొట్టి నర్సింలు హత్య చేశాడు. అనంతరం ఆమె ఫోన్ 200లకు గుర్తుతెలియని వ్యక్తికి అమ్మేశాడు. రక్తపు మరకలు పడిన తన దుస్తులను మార్చి చేతి సంచిలో దాచిపెట్టాడు. శ్యామల కనిపించకపోవడం, ఆమెకు కాల్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణతనతో సన్నిహితంగా ఉన్న మహిళ వేరొకరితో చనువుగా ఉందని హత్య లో పట్టణ సీఐ నేతృత్వంలో రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. జూన్ 3వ తేదీన రైల్వే ట్రాక్ పక్కన శ్యామల మృతదేహం కుళ్లిపోయి లభ్యమైంది. సాంకేతికత ఆధారంగా నిందితుడు నర్సింలును పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు గతంలోనూ కూలీలను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడ్డాడు. జైలు జీవితాన్ని గడిపి బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నెల 17న కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు.