తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురం, మైలార్ దేవులపల్లి, లక్ష్మీగూడ, కాటేదాన్, బుద్వేల్ ప్రాంతాల ఓటర్లకు ఎ.ఈ.ఆర్.ఓ, తహశీల్దార్ బొమ్మ రాములు ముఖ్య విజ్ఞప్తి చేశారు. తేది 19న (ఆదివారం) సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి.యల్.ఓలు ప్రత్యేకంగా అందుబాటులో ఉండి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, పూర్తి చేసిన ఫారాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హ ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అందువల్ల సంబంధిత ప్రాంతాల ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాన్ని తీసుకుని, అందులోని వివరాలను పూర్తిగా, స్పష్టంగా నింపి ఎలాంటి ఆలస్యం చేయకుండా అదే రోజు బి.యల్.ఓకు అందజేయాలని కోరారు.
ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు కావాలంటే ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, ఇది ప్రతి ఓటరు బాధ్యత అని అధికారులు తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణలో నిర్లక్ష్యం చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా పరస్పరం అవగాహన కల్పించి సమయానికి ఫారాలను సమర్పించాలని సూచించారు. శాస్త్రీపురం, మైలార్ దేవులపల్లి, లక్ష్మీగూడ, కాటేదాన్, బుద్వేల్ ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి వెంటనే బి.యల్.ఓలకు అందజేసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని ఎ.ఈ.ఆర్.ఓ, తహశీల్దార్ బొమ్మ రాములు విజ్ఞప్తి చేశారు.