తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: సీతారాం దూలిపాళ ఆధ్వర్యంలో జరిగిన ది సిటీజన్స్ కౌన్సిల్ ముఖ్య సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యూర్ బిల్లుపై విస్తృతంగా చర్చించి పలు కీలక అభ్యంతరాలు, సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్రతిపాదిత బిల్లు 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా స్థానిక సంస్థల అధికారాలను పరిమితం చేసి, నిర్ణయాధికారాలను కేంద్రీకరిస్తోందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాత్రను బలోపేతం చేయడంతో పాటు వార్డు కమిటీలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని కోరారు.ఆస్తి పన్ను అసమానతలకు శాశ్వత పరిష్కారం చూపాలని, క్యాపిటల్ వ్యాల్యూ ఆధారిత పన్ను విధానం వల్ల మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నీటి సరఫరా, మురుగునీటి ఛార్జీల స్వయంచాలక వార్షిక పెంపును పునర్విమర్శించాలని కోరారు.కార్పొరేషన్ పరిధిలో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా ఉండేలా చట్టంలో స్పష్టమైన నిబంధనలు చేర్చాలని, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పారదర్శక పట్టణ పాలనకు క్యూర్ బిల్లును రూపొందించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో ఉపేంద్రనాథ్ రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, షేక్ ఆరిఫ్ మహమ్మద్, రామసుబ్బారెడ్డి, విద్యాసాగర్, దిలీప్ కక్కడ, బదరీనాథ్, గోపాలకృష్ణ, రామచంద్రరావు, అను కపూర్, శ్రీధర్ రెడ్డి, నరేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
