హైదరాబాద్: నారాయణగూడ పద్మశాలి భవన్‌లో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శనను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, BC JAC స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాళ్లను పరిశీలించిన గుజ్జ సత్యం, చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యాన్ని అభినందించారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు.
ప్రస్తుతం చేనేత రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా నేతన్నలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని, వినియోగదారుల్లో చేనేత వస్త్రాలపై అవగాహన పెంపొందుతుందని ఆయన అన్నారు.
చేనేత ఉత్పత్తులను ప్రజలు ప్రోత్సహించి కొనుగోలు చేయడం ద్వారా వేలాది మంది నేతన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించిన వారవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా చేనేత రంగ అభివృద్ధికి మరింత ప్రోత్సాహక చర్యలు చేపట్టి, నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధులు, తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం నాయకులు, చేనేత కార్మికులు, మహిళలు, పద్మశాలి సంఘ ప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
