మునుగోడు, జూలై 21: చేనేత సహకార సంఘాలు చేనేత కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు అవ్వారి భాస్కర్‌తో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను చేనేత కార్మికుల పనిలోనే ఎదిగిన వ్యక్తినని, వారి కష్టాలు, సమస్యలను దగ్గర నుంచి చూసిన అనుభవం తనకు ఉందన్నారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మునుగోడు నియోజకవర్గం చేనేత కళాకారులకు, చేనేత కళలకు పెట్టింది పేరని పేర్కొన్న ఆయన, మరమగ్గాల వినియోగం పెరిగిన తర్వాత సంప్రదాయ చేనేత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. పనులు తగ్గిపోవడంతో పాటు దొరికిన పనికి తగిన ఆదాయం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికుల కోసం రూ.326 కోట్ల రుణమాఫీ అమలు చేయించేందుకు తాను కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం కూడా చేనేత రంగ అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు.

నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు చేనేత కార్మికుల సమస్యలను సమగ్రంగా గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలను సేకరించి, వాటిని విడతల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అవ్వారి భాస్కర్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, సహకార సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy

You missed