• కులగణనలో శాస్త్రీయతకు యూనిక్ కోడ్ ఒక్కటే పరిష్కారం
• జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం
హైదరాబాద్, జూలై 21 : జనగణన–2027లో చేపట్టనున్న కులగణనలో ప్రతి గుర్తింపు పొందిన కులానికి “యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ (Unique National Caste Code – UNCC)” కేటాయించకుండా కేవలం ఓపెన్-ఎండెడ్ విధానంలో కులాల వివరాలు నమోదు చేస్తే, మరోసారి బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుజ్జ సత్యం హెచ్చరించారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో తొలిసారిగా కులగణన చేపట్టడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోతే ఈ చారిత్రాత్మక అవకాశమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు.
గతంలో 2011లో నిర్వహించిన సామాజిక-ఆర్థిక కుల సర్వే (SECC)లో ఒకే కులం అనేక పేర్లతో నమోదు కావడం, వేలాది ప్రాంతీయ పేర్లు, భాషా భేదాలు, స్పెల్లింగ్ తేడాల కారణంగా డేటా విశ్లేషణ క్లిష్టంగా మారిందని గుర్తు చేశారు. ఆ తప్పిదాల నుంచి కేంద్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం జనగణన–2027కు సంబంధించి మొదటి దశ ప్రక్రియలు పూర్తికాగా, రెండో దశలో ప్రశ్నావళి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతి గుర్తింపు పొందిన కులానికి ముందుగానే యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ కేటాయించి, అదే కోడ్ ఆధారంగా కుల వివరాలు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గుర్తింపు కోడ్‌లతో నమోదు జరుగుతున్నప్పుడు, బీసీలు సహా ఇతర కులాలను మాత్రం ఓపెన్-ఎండెడ్ విధానంలో నమోదు చేయడం శాస్త్రీయ పద్ధతి కాదని గుజ్జ సత్యం విమర్శించారు. ఒకే దేశంలో ఒకే జనగణనకు రెండు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదన్నారు.
భారతదేశంలో ఒకే కులం వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లు, స్థానిక ఉచ్చారణలు, భాషా రూపాల్లో ఉండటం సహజమని, యూనిక్ కోడ్ లేకుంటే ఒకే కులం అనేకసార్లు నమోదై వాస్తవ జనాభా గణాంకాలు వక్రీకరించే ప్రమాదం ఉందన్నారు. అటువంటి తప్పిదాలు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, విద్యా మరియు ఉపాధి అవకాశాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కోడ్ ఆధారిత విధానం అమలు చేయడం వల్ల గణాంకాలు మరింత క్రమబద్ధంగా నమోదు చేయగలిగారని, బీహార్ కుల సర్వే కూడా ఈ విషయంలో ఒక మంచి నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే విధమైన కోడింగ్ వ్యవస్థను అమలు చేయాలని కోరారు.
ప్రస్తుతం రూపొందిస్తున్న జనగణన ప్రశ్నావళిని 2011 నమూనాకు పరిమితం చేయకుండా, ప్రస్తుత సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని గుజ్జ సత్యం సూచించారు. తుది ప్రశ్నావళిని ఖరారు చేసే ముందు బీసీ సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు, ప్రజా విధాన నిపుణులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
“ఖచ్చితమైన డేటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదు. శాస్త్రీయ కులగణన ద్వారానే దేశంలోని వెనుకబడిన వర్గాల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయి. జనగణన–2027ను చారిత్రాత్మక విజయంగా నిలబెట్టాలంటే యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ అమలు తప్పనిసరి” అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.
ఈ అంశంపై తాను ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు సమగ్ర వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, జనగణన ప్రక్రియ ప్రారంభానికి ముందే దేశంలోని ప్రతి గుర్తింపు పొందిన కులానికి యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీసీ నాయకులు శ్రీనివాస్, జిల్లా నరేందర్ తదితరులు పాల్గొని యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ అమలుకు మద్దతు ప్రకటించారు.
