Telangana Express News : నీట్ ప్రశ్నాపత్రాల అవినీతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అరంఘార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పత్రాల లీకేజీ అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌ను నాయకులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తిస్థాయి పారదర్శకతను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ వీవర్ సెల్ ప్రధాన కార్యదర్శి బొల్ల వెంకటేశ్వర్లు, కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ధనుంజయ్, మైలార్దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ లతో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.