తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజమాబాద్ (జూలై 24): పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులతో పాటు ప్రజలందరికీ అవగాహన పెంపొందించి.. ఆ క్రతువులో భాగస్వాములను చేసేందుకు కేంద్రం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్ఎసీపీసీ)’ను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలను కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మానవ వనరుల, విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా చేపడుతున్నాయి. ఈ కార్యక్రమం కూడా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ తరహాలో ఉంటుంది. పోటీల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చి.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీపడొచ్చు.
పోటీల్లో పాల్గొనేవారు జులై 15 నుంచి సెప్టెంబరు 15 వరకు https://ecomitram org/activities/nspc-2026 వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తొలి గ్రూపులో 1-5, రెండో దాంట్లో 6-8, మూడులో 9-12, నాలుగులో డిగ్రీ, పీజీ, రీసర్చ్ స్కాలర్స్ చివరి గ్రూపులో పౌరులెవరైనా పాల్గొనవచ్చు.
పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల వినియోగం, శిలాజ ఇంధనాలు-హరితగృహ ప్రభావం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ప్రాధాన్యం, అడవుల సంరక్షణ అవశ్యకత వంటి అంశాలపై ఆన్లైన్ క్విజ్లో ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత ధ్రువపత్రం పొందొచ్చు. ఫలితాలు సెప్టెంబరు 20న విడుదల చేస్తారు. విద్యార్థులను బాగా ప్రోత్సహించే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నట్లు జిల్లా సైన్సు అధికారి గంగాకిషన్ తెలిపారు.
ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి 22,529 మంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల కేటగిరీలో 6045 మందితో నిజామాబాద్ జాతీయ స్థాయిలోనే ప్రథమస్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో పుణె, నాలుగో స్థానంలో హైదరాబాద్ (4282 మంది పోటీదారులు) నిలిచాయి.
ప్రధానోపాధ్యాయుల చొరవతో ఆన్లైన్ క్విజ్ పోటీల్లో ఇందూరు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడంపై అధికారులు అభినందిస్తున్నారు. చివరి వరకు క్విజ్లో పిల్లలను ప్రోత్సహించి ప్రథమ స్థానంలో నిలపాలని, పౌరులు కూడా భాగస్వాములు కావాలని సైన్స్ అధికారి కోరారు.
