Telangana Express News : ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ధర్నాలో విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు పాల్గొన్ని నిరసన తెలిపారు. కార్యక్రమంలో కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని మండిపడ్డారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను దేశ ప్రజలు సహించరని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు తిప్పికొట్టే సమయం వచ్చిందని హెచ్చరించారు. ఢిల్లీలో గాయపడిన విద్యార్థులకు బీఆర్‌ఎస్ పార్టీ, బీఆర్‌ఎస్‌వీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నిరసనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ధర్నా చౌక్‌ను హోరెత్తించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధు చారి రాముయాదవ్, కొంపల్లి జగదీష్, ఉప్పల్ శ్రీను, రాఘవేందర్ యాదవ్, మైసీ రెడ్డి, భాస్కర్, ప్రదీప్ చిన్న, వెంకటరమణ, అనిల్, రిషి నాని తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌వీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.