తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్, అంజయ్య నగర్ డివిజన్లలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఎన్యుమరేషన్ కేంద్రాలకు కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ తో మాట్లాడి సర్ ఎన్యుమరేషన్‌ కార్యక్రమ క్షేత్ర స్థాయి స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలన సందర్భంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం, వివరాలను సేకరించడం, ఓటర్లతో సమన్వయంను నిర్వహిస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, అయోమయాలకు తావు లేకుండా చూడాలని ఈ సందర్బంగా సూచించారు. ఆయా నూతన డివిజన్ల పరిధిలో వివిధ పోలింగ్ స్టేషన్లలో ఎన్యుమరేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు సేకరించిన ఫారాల సంఖ్య, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల వివరాలను బీఎల్ఓలను నుంచి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా 100 శాతం కవరేజ్ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. సేకరించిన దరఖాస్తులను అదే రోజు డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్ఓలకు, సూపర్వైజర్లకు ఈ సందర్బంగా సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియకు సహకరించాలని ఈ సందర్బంగా కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమయం దగ్గర పడుతుందని, ఎవరు కూడా అలసత్వం పాటించకుండా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సరైన వివరాలతో ఓటరు జాబితా సిద్ధమైతే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఇంటింటికీ వచ్చే బూత్ లెవల్ అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించి సహకరించాలని కోరారు. అలాగే పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో మార్పులు ఉంటే వాటిని ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హమీద్ పటేల్ పిలుపునిచ్చారు.