• డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ

హనుమకొండ, జూలై 29 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): గురు పూర్ణిమ సందర్భంగా హనుమకొండలోని స్పందన మానసిక మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ సంయుక్త సహకారంతో డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ మానసిక దివ్యాంగులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి అనురాగ్ సొసైటీ చైర్మన్, వరల్డ్ వైజ్ కన్జూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సంస్థల నేషనల్ వైస్ చైర్మన్, ఎడ్వైజర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మానసిక దివ్యాంగుల సేవే విశ్వ మానవ సేవ” అని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చేయించుకోవాలని, ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, కెమిస్ట్ రవి, స్పందన ఆశ్రమ నిర్వాహకులు సుచరిత, వసుధ, హరిత, భార్గవి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అభిరామ్ గార్డెన్‌లో నిర్వహించిన గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి పాల్గొని భక్తులకు సేవలందించారు.

Avatar photo

By Murthy