• రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి: గుజ్జ సత్యం
• ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మహా ర్యాలీలు విజయవంతం
• 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దు
• విద్యార్థుల ఐక్యత ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక.. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం
హైదరాబాద్, జూలై 31: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన విద్యార్థుల మహా ర్యాలీలు, కలెక్టరేట్–ఆర్డీవో–ఎంఆర్ఓ కార్యాలయాల వరకు చేపట్టిన ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జాక్ స్టేట్ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వం దృష్టిని ఆకర్షించారని అన్నారు. ఇది కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే కాదని, పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ కోసం జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమమని పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరీక్షలు, సర్టిఫికెట్లు, ప్లేస్‌మెంట్లు, ఉన్నత విద్య అవకాశాలు కూడా ప్రభావితమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“హామీ ప్రభుత్వానిది… బకాయి ప్రభుత్వానిది… మరి శిక్ష విద్యార్థికెందుకు?” అని ప్రశ్నించిన గుజ్జ సత్యం, ప్రభుత్వం చెల్లించాల్సిన నిధుల జాప్యం కారణంగా పేద కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే గతంలో అమలులో ఉన్న విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సంవత్సరం వారీగా, సామాజిక వర్గాల వారీగా పెండింగ్ బకాయిల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేసి, బకాయిల చెల్లింపులకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ఆలస్యం తగదని స్పష్టం చేశారు.
నేటి యువత చైతన్యవంతమైందని, విద్యా హక్కుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే ప్రజాస్వామ్యబద్ధంగా మరింత విస్తృత ఉద్యమాలు చేపట్టే పరిస్థితి ఏర్పడుతుందని గుజ్జ సత్యం హెచ్చరించారు. ప్రభుత్వం ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యవసర అంశంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ “విద్యపై పెట్టుబడి పెట్టడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల పేద విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి” అని అన్నారు.
అలాగే “విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. విద్యా హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించకూడదు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కర్నాటి ధనంజయ, సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు చామకూర రాజు, సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, బీసీ నాయకులు బ్రహ్మయ్య, విద్యార్థి నాయకులు గుర్రం శ్రవణ్, లక్ష్మీనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
చివరిగా, ఈనాటి రాష్ట్రవ్యాప్త మహా ర్యాలీలను విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, మీడియా ప్రతినిధులకు గుజ్జ సత్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే, విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తృతమైన, శాంతియుతమైన, రాజ్యాంగబద్ధ ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. విద్యార్థుల విద్యా హక్కుల సాధన వరకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది” అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.
