తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు సమీపంలో పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ లక్ష్యంగా గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్ , స్థానిక నాయకులు, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ఒక మొక్క ఎన్నో ప్రాణాలకు ఆధారం, ప్రకృతి మన సంపద, పరిరక్షణ మన బాధ్యత అని, చెరువులు నగరానికి గొప్ప వరం వంటివని,వాటి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెరువుల చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడబడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని శ్రీకాంత్ తెలిపారు. గుర్నాధం చెరువు పరిరక్షణ కోసం,చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు,గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని, చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రజల సహకారంతోనే చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నరేందర్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, లోకేష్, రమేష్, కె ఎస్ బాబు, శ్రీనివాస్,పాండు, చైతన్, రామ్, శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.