• సుస్మిత కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవలు – ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి

వేలేరు, ఆగస్టు 3: ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుస్మిత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు కంటి సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వేలేరు గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించాలని సుస్మిత కంటి ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరగా వెంటనే స్పందించి శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

శిబిరంలో పాల్గొన్న వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకుని సేవలను వినియోగించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు ప్రశాంత్, చైతన్య, సురేష్, సునీల్, సుస్మిత కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనూష, అఖిల్, తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Avatar photo

By Murthy