తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ రత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ, తల్లిపాలే శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమృతమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను అందించడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని వివరించారు. గర్భిణీలు గర్భధారణ సమయంలోనే సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రసవానంతరం తల్లిపాలను నిర్లక్ష్యం చేయకుండా శిశువుకు అందించడం ప్రతి కుటుంబ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలో మరింత అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కనకవ్వ, అనిత, మాధవి, గర్భిణీలు, బాలింతలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.