తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు బుర్రి ఉపేంద్ర అధ్యక్షతన గిరి ప్రసాద్ భవనంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ డ్రైవర్లకు జీవో నెం.60 ప్రకారం అమలవు తున్న రూ.20,500 వేతనాన్ని తగ్గించి జీవో నెం.1181 ద్వారా రూ.16,600కు పరిమితం చేయడం అన్యాయ మని మండిపడ్డారు. పాత వేతనాలనే యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం “సమాన పనికి సమాన వేతనం” అమలు చేసి నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని కోరారు. అలాగే హజార్డ్ అలవెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యుడు బి. క్లెమెంట్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో మరణించిన లేదా శాశ్వత వికలాంగులైన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. మాస్కులు, గ్లౌజులు, బూట్లు వంటి రక్షణ పరికరాలను ప్రతి నెల అందించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగి స్తామని, త్వరలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, ఉపాధ్యక్షులు పేరబోయిన మోహన్ రావు, జిల్లా నాయకులు బోడ వీరన్న, సతీష్ రెడ్డి, నకిరేకంటి కృష్ణ, రాయపూడి శ్రీను, సయ్యద్ వజీర్ మియా, ఇటికాల వెంకటేశ్వరరావు, అలవాల రాహేలు, తాటి నాగేంద్రబాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
