తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ రామకృష్ణ మఠం కమిటీ హాల్లో బుధవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిశువు జననం తర్వాత మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యానికి బలమైన పునాది పడుతుందని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం లేదా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించారు. తల్లిపాలలో శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెంపొందుతుందని చెప్పారు.
తల్లిపాలు తాగే పిల్లల్లో అంటువ్యాధులు, పోషకాహార లోపం, జీర్ణ సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయని, మానసిక, శారీరక ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బాలింతలు సమతుల్య పోషకాహారం తీసుకుంటూ, వైద్యుల సూచనలు పాటిస్తూ శిశువులకు క్రమం తప్పకుండా తల్లిపాలు అందించాలని సూచించారు. ప్రతి తల్లి తన బిడ్డకు కనీసం రెండేళ్ల వరకు తల్లిపాలు అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశు సంరక్షణ, తల్లి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. కార్యక్రమం ముగింపులో పాల్గొన్న తల్లులకు ఆరోగ్య సూచనలు అందజేసి, తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఎల్‌ఓ సూపర్వైజర్ సాంబరాజు, ఏఎన్‌ఎం జాబేదా, ఆశా వర్కర్ మీనా, అంగన్వాడీ టీచర్లు కుడికాల రాజేశ్వరి, వెంకటేశ్వరమ్మ, సునీత, ఆర్‌పీలు భారతి, సునీత, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.