తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఏ మ్యాన్‌హోల్‌కు మూత ఉందో, ఏది తెరిచి ఉందో గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సుమారు 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఆటో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ఇరుక్కుపో వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మరో ఘటనలో లారీ కూడా అదే విధంగా మ్యాన్ హోల్‌లో ఇరుక్కుపోయింది. ప్రమాదాలు పునరావృతం అవు తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగేలోపు శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు ఉన్న అన్ని మ్యాన్‌హోల్ లకు వెంటనే బలమైన మూతలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతున్నారు.
