తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా(ఆగస్టు05): కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషి ఫలితంగా రూ.105.91 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ రహదారులు, ప్రధాన రహదారుల, డ్రైనేజీలు,వంతెనలు, విద్య,వైద్య స్థానిక మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు వెల్లడించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎం (HAM) ఏజెన్సీ ద్వారా నియోజకవర్గంలోని 42 గ్రామీణ రహదారి పనులకు రూ.75.19 కోట్లు మంజూరు చేశారు. ఈ పనుల ద్వారా మొత్తం 116.85 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ పనులు భిక్కనూరు, బీబీపేట్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, రాజంపేట్, రామారెడ్డి మండలాల్లో అమలు కానున్నాయి.
అదే విధంగా రోడ్లు-భవనాల శాఖ హెచిఎం ఫేజ్-1 కింద రూ.30.72 కోట్లతో రెండు ప్రధాన రహదారుల బలోపేతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్హెచ్-44 నుంచి బురుగుపల్లి- రాజంపేట-గుండారం రహదారి (8 కి.మీ.), కామారెడ్డి- తుంపల్లి రహదారి (28.16 కి.మీ.) బలోపేతం చేయనున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి ఘనంగా సన్మానించారు. కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి వేగంగా సాగుతోందని పేర్కొన్నారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఎఫ్ డీఏ (FDA) నిధుల కింద రూ.25 కోట్లు, మరో రూ.20 కోట్లు, అలాగే సీఆర్ఆర్ (CRR) నిధుల కింద రూ.32 కోట్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీటి సౌకర్యాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఇప్పటికే మంజూరైన రూ.105.91 కోట్లతో గ్రామీణ, ప్రధాన రహదారుల అభివృద్ధి వేగవంతం కానుండగా, రానున్న రోజుల్లో అదనపు నిధులతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని షబ్బీర్ అలీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, నాయకులు భీమ్ రెడ్డి, నౌసిలాల్, సుధాకర్ రెడ్డి, నియోజకవర్గానికి సంబంధించిన ఇతర నాయకులు పాల్గొన్నారు.
